పార్టీ ఎంపీలు, నేతలు గుడ్‌బై చెబుతున్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ వచ్చే నెల 3న సతీసమేతంగా లండన్ బయల్దేరుతున్నారు. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25 దాకా అక్కడ పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల ఆయనకు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులు ఒకవైపు.. ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు.. పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తం కావడం, పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు తప్ప మిగతావారు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారంతో భవిష్యత్‌పై వైసీపీ శ్రేణు లు కలవరపడుతున్నాయి. ఈ తరుణంలో ఆయన విదేశీ పర్యటన వారిని ఇరకాటంలో పడేస్తోంది. ఇప్పటికే చాలామంది ముఖ్య నేతలు తాడేపల్లి ప్యాలెస్ వైపే రావడం లేదు. జగన్ కోటరీలో అతిముఖ్యులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటివారు కూడా అటువైపు చూడడం లేదు.