విమర్శలు, ఇబ్బందులు, ఆటుపోట్లు, ఆర్థిక కష్టాలు.. ఇలా అన్నిటిని ఎదుర్కొని నిలబడితే విజయం నీ ముంగిట నిలబడుతుంది అంటారు మేధావులు. అదే సినీ రంగం అయితే అన్ని కష్టాల కడగండ్లే.. ఇక్కడ నిలదొక్కుకొని విజయం సాధించారంటే.. జీవితంలో ఎదురే ఉండదు. ఆ కోవకు చెందిన వాడే విజయ్.. అందరు ముద్దుగా దళపతి విజయ్ అని పిలుచుకుంటారు. తమిళ సినీ రంగంలో ఎన్నో ఆటుపోట్లకు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకుని నిలబడిన విజయ్.. రాజకీయాల్లోకి ఆరంగ్రేట్రం చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. అభిమానులైతే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మొట్టమొదట వీడేం హీరో.. బండ మొహం ఇలా విమర్శించిన వారే ఇప్పుడు ఫ్యాన్స్ అయిపోయారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.విజయ్ పెట్టిన పార్టీ ఉద్దేశంపై దీక్ష మీడియా ప్రత్యేక కథనం..విజయ్ తల్లి శోభ గాయని, తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. తొలినాళ్లలో కనీసం బాత్రూమ్ కూడా లేని చిన్న గదిలో విజయ్ తల్లిదండ్రులు నివాసం ఉండేవారు. అతడి తల్లి కచేరీలకు వెళ్లి డబ్బులు తెచ్చిస్తే పూట గడిచే పరిస్థితి. విజయ్‌కి ఏడేళ్లు వచ్చేవరకు ఆర్థికంగా ఇలా సతమతమవుతూనే ఉండేది ఆ కుటుంబం. ఆ తర్వాతే దంపతులిద్దరూ విజయ్‌కాంత్‌తో ‘చట్టం ఒరు ఇరుట్టరై’ సినిమా తీశారు. తెలుగులో చిరంజీవి హీరోగా ‘చట్టానికి కళ్లులేవు’ ఇతర భాషల్లోనూ దాన్ని రీమేక్ చేశారు. అన్నిచోట్లా అది బంపర్‌హిట్టు సాధించడంతో ఆ కుటుంబం నిలదొక్కుకుంది. ప్రస్తుతం లియో సినిమా వరకు విజయ్‌కు ఎదురే లేదు.
‘‘ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు. ఇతర పార్టీలకు మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం’’ అని విజయ్ వెల్లడిరచారు. ఇక, పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.తమిళనాట రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు ‘దళపతి’ అని పిలుస్తుంటారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. ప్రతిభ చూపిన పదో తరగతి, ప్లస్ వన్, ప్లస్ టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టంచేయడంతో.. విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేశారు. అందులో భాగంగానే విజయ్ మక్కల్ ఇయక్కం (అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై రాజకీయ పార్టీపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ‘తమిళగ మున్నేట్ర కళగం’ పేరుతో పార్టీని స్థాపిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. దీనికి స్వల్ప మార్పులు చేసి ‘తమిళగ వెట్రి కళగం’ పేరును ఖరారు చేశారు.
విజయ్‌కి ఈ స్థాయి స్టార్డమ్ రావడం వెనుక తెలుగు చిత్రాల ప్రభావం ఎక్కువగానే ఉంది. విజయ్ కెరీర్లో ‘పోక్కిరి’, ‘గిల్లి’, ‘బద్రి’, ‘ఆది’, ‘వేలాయుధం’, ‘యూత్’ వంటి సినిమాలు ముఖ్యమైనవి. ఆ చిత్రాలే కెరీర్‌ను మలుపు తిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమా రీమేక్‌లు కావడం విశేషం. అలాగే విజయ్ అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో రెండుసార్లు నేరుగా సమావేశమై వారికి విందు, బహుమతులు అందిస్తారు.