దేశ రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. మొత్తం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరాల్సిన విమానం సాంకేతిక సమస్యలు, నిర్వహణ కారణాలతో టేకాఫ్ ఆలస్యమైంది. అప్పటికే విమానంలోకి చేరిన ప్రయాణికులు కొన్ని గంటల పాటు కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో కొందరు స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో దాదాపు 8 గంటల తర్వాత సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు వారిని మరో విమానంలో తరలించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.