నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా 60 మందికిపైగా ప్రయాణికులు గల్లంతైనట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ మార్గంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చిత్వాన్ జిల్లా ప్రధాన అధికారి ఇంద్రదేవ్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు.. బీర్గంజ్ నుంచి కాఠ్మాండూకు వెళ్తున్న ఏంజెల్ డీలక్స్ బస్సు, కాఠ్మాండూ నుంచి గౌర్‌కు వెళ్తున్న గణపతి డీలక్స్ బస్సుపై సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రెండు వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో ఏంజెల్ బస్సులో 24 మంది, గణపతి బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గణపతి బస్సులోని ముగ్గురు ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు.