సార్.. సార్ అని పిలవగానే.. సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌ని ఆపుచేశారు. రోడ్డు మీదే ఆగి వారిని పిలిపించి అక్కడే వినతిపత్రాలు స్వీకరించారు. నేనున్నా.. ధైర్యంగా ఉండండి.. అంటూ స్వయానా సీఎం భరోసా ఇవ్వడంతో వారి కళ్లు చెమ్మగిల్లాయి. శుక్రవారం ఉదయం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి రాష్ట్ర సచివాలయానికి బయలుదేరిన సమయంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. సందర్శకులు ఆ సమయంలో ఎదురు రోడ్డులో వేచి చూస్తున్నారు. వారి పిలుపు వినగానే చంద్రబాబు కాన్వాయ్‌ని ఆపు చేయించి కారు దిగారు. ఆయనను కలిసిన వారిలో అరకు దివంగత టీడీపీ నేత సివేరి సోమ సతీమణి ఇచ్ఛావతి కూడా ఉన్నారు. సోమను గతంలో నక్సలైట్లు కాల్చిచంపారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, తన కుమారుడి విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా సాయం చేయాలని ఆమె కోరారు. సోమ కొడుకు చదువు బాధ్యత తాము తీసుకొంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు అందరినీ ఆప్యాయంగా పలకరించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అంటున్నారు.