భారత్లోని పెద్దల్లో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట! నడక, వ్యాయామం లాంటివేమీ చేయరట! 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3 శాతం ఉండగా.. 2022 నాటికి 49.4 శాతానికి పెరిగిపోయింది! ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం ‘లాన్సెట్ గ్లోబల్ హెల్త్’లో ప్రచురితమైంది. కనీస వ్యాయామం చేయని వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండడం మరో విశేషం.2022 నాటికి శరీరానికి అవసరమైనంతగా వ్యాయామం చేయని పురుషులు 42 శాతం ఉంటే మహిళలు ఏకంగా 57.2 శాతం ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2030కి దేశంలోని పెద్దల జనాభాలో 60 శాతానికి పైగా శారీరకంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది.