సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ‘‘చిట్టి’’ హంగామా చూశారు కదా..? ఆ ‘రోబో’ అంతా సూపర్ ఫాస్ట్..! ఏదైనా చకచకా చేసేస్తుంది..! ఇప్పుడు ఇలాంటి రోబో టీచర్లు ‘చిట్టెమ్మ’లను హైదరాబాద్‌లోని నెక్ట్స్ జెన్ స్కూల్స్‌లో ప్రవేశపెట్టారు. కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌లోని పాఠశాలల్లో వీటి సేవలు అందుబాటులో ఉంటాయని నెక్ట్స్ జెన్ స్కూల్స్ వ్యవస్థాపకుడు కంకణాల రఘ తెలిపారు. ఇవి పూర్తిగా భారత్‌లో తయారైన ఈ రోబోలని, ఏఐ ఆధారంగా పనిచేస్తాయని చెప్పారు. కేపీహెచ్‌బీలోని ఓ హోటల్లో సోమవారం మీడియా సమావేశంలో రెండు రోబో టీచర్లను పరిచయం చేశారు. కేరళలోని కొచ్చికి చెందిన మేకర్స్ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ వీటిని తయారుచేసిందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి సందేహాలున్నా చకచకా జవాబు ఇస్తుందన్నారు. త్వరలోనే తెలుగుతో పాటు మరో 20 ప్రాంతీయ భాషలను కూడా బోధించేలా సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేస్తున్నట్లు మేకర్స్ ల్యాబ్ స్టార్టప్ ప్రతినిధి హరిసాగర్ చెప్పారు.