అమ్మవారి రూపాల్లో ఒకటైన దుర్గాదేవి కొలువుదీరిన కర్ణాటకలోని బప్పనాడు అనే ఊళ్లో కనిపించే ఈ ఆలయానికి ముస్లింలూ రావడం విశేషం. బప్పనాడు దుర్గాపరమేశ్వరి ఆలయం… కర్ణాటకలోని మంగళూరుకు దాదాపు ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కిలో బప్పనాడు అనే ప్రాంతంలో శాంభవీ నది ఒడ్డున కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఓ ముస్లిం వర్తకుడి పాత్ర కీలకం కావడం వల్లే నేటికీ హిందువులతో సమానంగా ముస్లింలూ ఆలయానికి వచ్చి దేవిని దర్శించుకుంటారు. బప్ప అనే ముస్లిం వర్తకుడు శాంభవీ నది గుండా ప్రయాణిస్తుంటే.. నీళ్లన్నీ ఎర్రగా, రక్తంలా మారిపోయాయట. అది చూసి వర్తకుడు భయపడితే ఆకాశవాణి ద్వారా తన గురించి చెప్పి ఇక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకోమని ఆదేశించిందట అమ్మవారు. అలా వర్తకుడు ఆలయ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ప్రాంతానికి బప్పనాడు అనే పేరు వచ్చింది. అలా అప్పటినుంచీ ఆ ప్రత్యేక వేడుకలకు సంబంధించిన ప్రసాదాలను ముందుగా బప్ప వంశస్థులకే పంపిస్తారు ఆలయ అర్చకులు. ఈ ప్రాంతంలో ఉండే ముస్లింలు తమ ఇంట్లో ఏ వేడుక తలపెట్టినా ముందుగా అమ్మవారిని పూజిస్తారు.