సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. రాజ్యసభకు ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు రాజీనామా చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు సన్నిహితులుగా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాషచంద్రబోస్, గొల్ల బాబూరావుతో పాటు మేడా రఘునాథరెడ్డి, ఆర్.కృష్ణయ్య కూడా రాజీనామాలు చేయబోతున్నారని భారీఎత్తున ప్రచారం సాగుతుండడంతో కలతచెందిన మాజీ సీఎం.. బుజ్జగింపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీని, తనను వదిలిపోవద్దని అభ్యర్థించారు. రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం వల్లే ఢల్లీిలో తనను గౌరవిస్తున్నారని.. మీరు రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికల్లో ఆ పదవులన్నీ టీడీపీకి వెళ్లిపోతాయని చెప్పారు. రాజీనామా చేయడం తనకు వెన్నుపోటు పొడవడమేనని నిష్ఠూరం ఆడినట్లు సమాచారం. దీంతో అయోధ్యరామిరెడ్డి, బోస్ శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్ ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ముందుకొచ్చి తాము జీవితాంతం జగన్ వెంటే ఉంటామన్నారు. ఈ మాట మీద ఎంతవరకు ఉంటారో చూడాలి.