ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మెస్రం వంశీయులు తాము బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో కొత్తకుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా… ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్తపుట్టను తయారుచేశారు. తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకుంటారు. ఇలా ఆదివాసీల పద్ధతిలో వేడుకలు జరుగుతాయి. ఇది చూడడానికి వేలాది మంది తరలివస్తారు.