ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న పాక్ పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాకిచ్చింది. కొత్తగా పాలపై పన్ను విధించింది. దీంతో స్థానికంగా పాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కంటే పాల ధరలు పాక్‌లోనే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సైతం అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే.పాకిస్థాన్ గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్యాకేజ్డ్ పాలపై అక్కడి ప్రభుత్వం 18 శాతం పన్ను విధించింది. దీంతో పాల ధరలు 25 శాతం పైగా పెరిగాయి. కొత్తగా పన్ను వేయడంతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర 370 రూపాయలకు (పాక్ కరెన్సీ) చేరింది. డాలర్ల ప్రకారం చూస్తే లీటర్ పాల ధర 1.33 డాలర్లుగా ఉంది. పారిస్‌లో లీటర్ పాల ధర 1.23 డాలర్లు కాగా.. మెల్బోర్న్లో 1.08 డాలర్లు మాత్రమే.