రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహాన్ని పురస్కరించుకుని మంగళవారం పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. ముంబయి సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ ఇందుకు వేదికైంది. దీనికి ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జంటలకు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు పంపిణీ చేశారు. అలాగే పెళ్లి కుమార్తెలకు స్త్రీధనం కింద ఒక లక్ష వెయ్యి రూపాయల చెక్కులు అందించారు. అంతేగాకుండా ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు. రాధికతో అనంత్ అంబానీ వివాహ వేడుకలు ఈ నెల 12న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడ్రోజుల పాటు జరగనున్నాయి.