తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలపై చర్చ జరగనున్నది.