రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరూ గుజరాతీలు. ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్‌లో అదానీ పవర్ అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ (ఎంఈఎల్) ఈక్విటీలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 26 శాతం వాటాను రూ.50 కోట్లకు కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ పారిశ్రామిక దిగ్గజాలు చేతులు కలపడం ఇదే మొదటిసారి. అయితే ఏ ప్రాజెక్టు అవసరాల కోసం ఆర్ఐఎల్ ఈ విద్యుత్‌ను ఉపయోగించబోతోందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఒప్పందం కింద ఎంఈఎల్ 20 ఏళ్ల పాటు ఆర్ఐఎల్కు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది.