ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై వివాదాలెన్నో! అసలు తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. చివరకు కొత్త ప్రభుత్వం దాన్ని తెరవాలని నిర్ణయించింది. సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న తెరవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ రెండో దఫా సమావేశం మంగళవారం పూరీలో జరిగింది. 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రథయాత్ర పనిభారం వల్ల శ్రీక్షేత్ర పాలనాధికారి భాండాగారం డూప్లికేట్ తాళపుచెవిని కలెక్టరేట్లోని ట్రెజరీ నుంచి తీసుకురాలేదని, ఆయన 14న తమకు అందజేస్తారన్నారు. దాంతో తెరుచుకోకపోతే తాళంకప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు చెప్పారు.