ప్రధాని మోదీ ఉక్రెయిన్లో బిజీగా ఉన్నారు. ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకి భారత ప్రజలు ఘన స్వాగతం పలికారు. 200 మంది భారతీయులను ప్రధాని మోదీ కలిశారు. తర్వాత ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఇద్దరు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జెలెన్ స్కీ భుజంపై మోదీ చేయి వేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మోదీ- జెలెన్ స్కీ కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. రష్యాతో జరిగిన యుద్ధంలో చనిపోయిన చిన్నారుల స్మారక ప్రాంతానికి చేరకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. మృతిచెందిన చిన్నారులకు అంజలి ఘటించారు. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఈ పర్యటన శాంతి నెలకొల్పేందుకు పనిచేస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెర్రెస్ అభిప్రాయ పడ్డారు.