దేశ వ్యాప్తంగా ఎక్కడ విన్నా వినేష్ ఫోగట్ అంశం చర్చనీయాంశమైంది. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండటంతో ఆమెపై పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు వేసిన అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. వినేష్ ఫోగట్ అనూహ్యంగా బరువు పెరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వినేష్ ఫోగట్ తన మొదటి మ్యాచ్ ఆడటానికి ముందు.. బరువు పరీక్షలో 50 కిలోల కంటే తక్కువుగా ఉన్నారు. తరువాత రోజు పరీక్షలో ఆమె ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు ఎక్కువుగా ఉన్నప్పటికీ ఆమె పెరిగిన బరువు మాత్రం దాదాపు 2 కేజీలుగా ఉంది. గంటల వ్యవధిలో 2 కేజీల బరువు ఎలా పెరిగిందనేది ఎవరికి అంతుపట్టడంలేదు. ఉదయం బరువు పరీక్ష తర్వాత ఆమె మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడిరది. అంటే ఆమె కొంత శక్తిని కోల్పోయి ఉంటుంది. ఈ సమయంలో వినేష్ బరువు పెరిగే అవకాశం లేదు. ఒకవేళ బరువు పెరిగిందంటే మాత్రం మ్యాచ్‌ల మధ్య వచ్చిన గ్యాప్‌లో తీసుకున్న ఆహారం కారణంగానే ఆమె బరువు పెరగాలి. వినేష్‌కు ఎలాంటి ఆహారం ఇవ్వాలి.. ఆమె ఏం తీసుకుంటుందనేది తన కోచ్ పర్యవేక్షించాల్సి వస్తుంది. కోచ్ పట్టించుకోకపోవడంతోనే ఆమె బరువు పెరిగిందనే వాదన వినిపిస్తోంది.