ప్రతీరోజు పగలు ఇంటర్సిటీ రైలును గుంటూరు – బెంగళూరు – గుంటూరు మధ్యన నడపాలని కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ప్రజలకు బెంగళూరు వెళ్లేందుకు ఉదయం ఎలాంటి రైలు సదుపాయం లేదు. దీనికి సంబంధించిన ప్రతిపాదన దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి కేంద్ర రైల్వే బోర్డుకు వెళ్లింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే త్వరలోనే బెంగళూరుకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అమరావతి రాజధాని నగరాన్ని గుంటూరు జిల్లా కలిగివున్న దృష్ట్యా ఇటు ఏపీ, అటు కర్ణాటక క్యాపిటల్స్ మధ్యన ఈ రైలు ప్రయాణిస్తుంది. సాఫ్టువేర్ ఇంజనీర్లు చాలామంది బెంగళూరు పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే అమరావతి రాజధానిలోనూ సాఫ్టువేర్ పరిశ్రమ విస్తరించనుంది. ఈ నేపథ్యంలో గుంటూరు – బెంగళూరు ఇంటర్సిటీ రైలుకు ఆక్యుపెన్సీ బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.