ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని చాలా మంది అనుకుంటారు. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేక కొందరు.. ఆర్థిక స్తోమతలేక ఇంకొందరు.. తమ చిరకాల కోరికను అణచివేసుకుంటారు. అలాంటి వారి కోసం చైనాకి చెందిన డ్రోన్ తయారీ సంస్థ డీజేఐ గ్లోబల్.. డ్రోన్ సాయంతో అద్భుతమైన వీడియో చిత్రీకరించింది. అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ వీడియో చూసిన వారెవరైనా వారెవ్వా.. అనాల్సిందే! సముద్రమట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ నుంచి డ్రోన్‌ను ప్రయోగించారు. అక్కడి నుంచి శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ.. అక్కడి దృశ్యాలను డ్రోన్ చిత్రీకరించింది. శిఖరానికి సమీపంలో ఉన్న హిమనీ నదాలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కనులవిందు చేస్తున్నాయి.