గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుని ముందుకెళ్తే ఇక ఇంతే అనేలా ఉంది పరిస్థితి. మ్యాప్ లొకేషన్ రోడ్డుని కాకుండా గోతులు, నదుల్లోకి చూపించడమే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. తాజాగా కేరళలో ఇలాంటి మరో ఘటన జరిగింది. కాసర్గోడ్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకున్న ఇద్దరు యువకులు కారుతోసహా నేరుగా వాగులోకి దూసుకెళ్లారు.అయితే వారి వాహనం నదిలోకి వెళ్లకుండా చెట్టు అడ్డుపడటంతో సురక్షితంగా బయటపడ్డారు. బాధితులలో ఒకరైన అబ్దుల్ రషీద్.. గూగుల్ మ్యాప్ తప్పుగా చూపడంతోనే తాను కారుని నదిలోకి తీసికెళ్లినట్లు చెప్పాడు. తమకిది పునర్జన్మే అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇలాంటి ఘటనే మే నెలలోనూ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఎస్యూవీ (ఫోర్డ్ ఎండీవర్)లో కేరళ టూర్ వెళ్లారు. మార్గం తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వాహనం నడుపుతున్నారు. కురప్పంతర ప్రాంతానికి చేరుకోగానే గూగుల్ మ్యాప్స్ రోడ్డు వైపు కాకుండా కాలువ వైపు వెళ్లాలని సూచించింది. దాంతో కారు కాలువలోకి వెళ్లిపోయింది.