రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డులపై జగన్ బొమ్మ ముద్రించింది. వైకాపా రంగులతో కార్డులు ఇచ్చింది. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలిస్తున్నారు. వైకాపా హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89 లక్షల రేషన్ కార్డులకు ఆహారభద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండు చేస్తుంటే నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తోంది.