ఆమె.. మంత్రి లేదా చట్టసభ సభ్యురాలు కాదు. కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు. జరుగుతున్నది ప్రభుత్వ కార్యక్రమం. మంత్రి భార్యగా ఓ ప్రైవేటు వ్యక్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారంతే. ఆమె వస్తున్నారని పోలీసులు ఎలాంటి ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు. అయినాసరే తమ కాన్వాయ్‌లో ఎస్ఐ రాలేదంటూ అమాత్యుడి సతీమణి అతి చేశారు. నడిరోడ్డు మీద స్థానిక ప్రజలు చూస్తుండగానే ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖా మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి భార్య హరిత వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలకు, వీళ్లకు తేడా ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాంప్రసాద్‌రెడ్డి భార్య హరిత హాజరయ్యారు. తమ కాన్వాయ్‌లో చిన్నమండెం ఎస్ఐ రమేశ్‌బాబు రాకపోవడంతో మండిపడ్డారు.