ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఓ తెలుగు ఎన్నారైనినట్టేట ముంచింది. దిక్సూచిగా ఉండే జీపీఎస్ అతడికి నేరుగా పరలోకానికి దారి చూపించింది. కరీంనగర్ నగరానికి చెందిన మొహమ్మద్ షప్ాబాజ్ ఖాన్ అనే 27 ఏళ్ళ యువకుడు ?సౌదీ అరేబియాలోని అల్ హాసా ప్రాంతంలో ఒక టెలికాం కంపెనీలో టవర్ల నిర్వహణ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా అయిదు రోజుల క్రితం సుడాన్ దేశానికి చెందిన సహచరుడితో కలిసి వెళ్లిన అతడు పొరపాటున ఎడారిలో దారి తప్పిపోయాడు. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా కారును నడుపగా అది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన రుబా అల్ ఖళీ అనే ఎడారి వైపు తీసుకెళ్ళింది. నాలుగు దేశాలలో విస్తరించి ఉన్న కాకులు కూడా దూరని ఈ ఎడారిలో దారి తప్పితే మరణమే దిక్కు. కారులో పెట్రోలుతో పాటు ఆహారం, నీళ్ళు కూడా పూర్తిగా అయిపోయి చివరకు మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా అయిపోవడంతో జీవితంపై ఆశలు వదులుకున్నాడు. ఆగిపోయిన కారు వద్ద ఇసుకలో చాప (జనిమాజ్) పరిచి నమాజు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. వీరి గల్లంతు గురించి ఫిర్యాదు అందుకొన్న పోలీసులు హెలికాప్టర్ల ద్వారా గాలించగా నమాజు చేసే చాపపై పడి ఉన్న వీరి మృతదేహాలను కనుగొన్నారు.