నైపుణ్యతపై అవగాహన
నాయకత్వం అనేది ప్రత్యేక నైపుణ్యం. విద్యార్థి దశ నుంచే దీన్ని పెంపొందించుకుంటే కళాశాల స్థాయిలోనే విజయాలకు పునాది ఏర్పడుతుంది. స్వతంత్ర ఆలోచనలు వికసించి చక్కని వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఫలితంగా అద్భుతమైన కెరియర్‌కు చక్కని బాట వేసుకోవటానికి వీలవుతుంది!
విద్యార్థి నాయకత్వం అంటే.. ప్రధానంగా కళాశాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో చొరవ చూపించటం, క్రియాత్మకమైన పాత్ర పోషించటం. ఈ ప్రక్రియలో సానుకూలమైన నైపుణ్యాలు క్రమంగా వృద్ధి చెందుతాయి. అందరితో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో తమతో పాటు సహ విద్యార్థులు విద్యా, విద్యేతర కార్యక్రమాల్లో దూసుకువెళ్లేందుకు ప్రేరణను ఇవ్వగలుగుతారు. కష్టసుఖాలనూ, లాభనష్టాలనూ తట్టుకుని నిలబడగలిగే శక్తి నాయకుడికి పుష్కలంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యమూ ఎక్కువే. ఒకవేళ తాను తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం జరిగినా.. దానికి పూర్తి బాధ్యత తనదేనని నిజాయతీగా ఒప్పుకుంటాడు.
విజయవంతమైన నాయకుడు ఎప్పుడూ తన ఆలోచనలూ, అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తాడు. కాబట్టి బృంద సభ్యులు కూడా ప్రాజెక్టు లక్ష్యాలూ, అంచనాలకు తగినట్టుగా పనిచేస్తారు. ఇతరుల అభిప్రాయాలను జాగ్రత్తగా వింటాడు. మాట్లాడినా, రాసినా ఎలాంటి అనుమానాలూ, అపోహలకూ తావులేకుండా చూసుకుంటాడు. నిజానికి మిగతా నైపుణ్యాలకు ఇది పునాది లాంటిది. ప్రతిభావంతులైన నాయకుడు బృందంలో స్ఫూర్తిని నింపుతాడు. తన ఆలోచనలను సభ్యులకు తెలియజేస్తూ.. వాళ్లందరూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ధికి తోడ్పడేలా చేస్తాడు.
ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా కొత్తగా ఎప్పుడూ ఏదైనా నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ క్రమంలో డిప్లొమా, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతూనే ఉంటాడు. అలాగే గెలుపు, ఓటములు ఏవి ఎదురైనా ఆ అనుభవాలను గుర్తుపెట్టుకుంటాడు. వాటి నుంచి పొందిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందిపుచ్చుకుంటాడు.
స్వీయ అవగాహన
తన సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. అనుభవ పాఠాలను వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో అన్వయిస్తాడు. ఈ విధమైన అవగాహన లక్ష్య సాధనకూ, నాయకత్వ నైపుణ్య దిశగా ఎదుగుదలకూ తోడ్పడుతుంది.
మీ బలాలు, బలహీనతలను ముందుగా అర్థం చేసుకోవాలి. దాంతో ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో, వేటిని మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది. ఆన్లైన్లో లీడర్షిప్ క్వాలిటీస్కు సంబంధించిన క్విజ్‌లూ అందు బాటులో ఉన్నాయి. వీటిలో పాల్గొనడం ద్వారా మీరే స్థాయిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. కొన్ని విద్యాసంస్థలు నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకునే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఏ నాయకత్వ విధానాన్ని అనుసరిస్తున్నారనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. బృందాన్ని ఆదేశించే విధానాన్నే మీరు ఎక్కువగా అనుసరిస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు ఎక్కువగా చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డెలిగేటివ్ శైలిని అనుసరిస్తూ బృందానికి ఎక్కువగా స్వేచ్ఛను ఇస్తే.. బృంద సభ్యులూ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. నాయకత్వ లక్షణాల అభివృద్ధికి.. పరిశీలించడం చాలా అవసరం. ప్రముఖ నాయకుల వ్యవహారశైలి ఎలా ఉంది, వాళ్లు సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నారు, సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు, నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తూ బృంద విజయానికి కృషిచేస్తున్నారో తెలుసుకోవచ్చు. పారిశ్రామిక ప్రదర్శనలకు హాజరుకావడం, సోషల్ మీడియా సైట్ల ద్వారా ఇతర నాయకులతో పరిచయాలూ పెంచుకోవచ్చు.