సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రియాద్ నుంచి బయలుదేరిన విమానం పెషావర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు రావడాన్ని ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని విమాన పైలెట్‌తోపాటు సహాయక బృందాలకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని వెంటనే ఎయిరోపోర్ట్‌లో నిలిపివేశారు.అనంతరం విమానం నుంచి ప్రయాణికులతోపాటు సిబ్బందిని దింపివేశారు. మరోవైపు విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు గల కారణాలను సాంకేతిక బృంద నిపుణులు అన్వేషిస్తున్నారు. 276 మంది ప్రయాణికులు, 21 మంది విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్‌లోని పెషావర్‌కు బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.