ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చాటి చెప్పే విషయం ఒకటి వెలుగుచూసింది. తెలంగాణలోని నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైన ఏడు ముంపు మండలాలను విజయవంతంగా ఏపీలో విలీనం చేయించారు. ఈ ఏడు మండలాలను ఇవ్వకపోతే ప్రాజెక్టు నిర్మాణం జరగదని భావించిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ మండలాల విలీనానికి పట్టుబట్టారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఖరాఖండిగా చెప్పారు. విలీనం చేయకపోతే సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేయబోనని కేంద్ర పెద్దలకు చంద్రబాబు తెగేసి చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన ఈ కీలక పరిణాన్ని చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ప్రస్తావించారు.కాగా 2024 ఎన్నికల మాదిరిగా 2014లో కూడా బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేయగా జనసేన మద్దతు ఇచ్చింది. ఇక 2014-2019 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరుగులు పెట్టించారు.