తేలికపాటి విమానంతో టేకాఫ్ తీసుకున్న నెదర్లాండ్స్‌కు చెందిన నరైన్ మెల్కుమాజన్ అనే మహిళా పైలట్‌కు అంతలోనే ఊహించని అనుభవం ఎదురైంది. గగనతలంలో విన్యాసం చేస్తుండగా.. అకస్మాత్తుగా విమానం పైకప్పు తెరచుకుంది. అటువంటి భయానక పరిస్థితుల్లోనూ అలాగే కొద్దిసేపు ప్రయాణించి.. చివరకు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ.. ప్రయాణంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పైలట్లకు సూచనలు చేశారు.‘‘విమానంతో విన్యాసాల శిక్షణలో భాగంగా అది నా రెండో ప్రయాణం. నేను నడుపుతోన్న ‘ఎక్స్ట్రా 330ఎల్ఎక్స్’ గాల్లో ఉండగానే దాని పైకప్పు తెరచుకుంది. టేకాఫ్‌కు ముందు సరిగ్గా తనిఖీలు చేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే శిక్షణకు వెళ్లడం కూడా నేను చేసిన మరో తప్పు. ఆ సమయంలో కళ్లద్దాలు కూడా లేకపోవడంతో నా పరిస్థితి మరింత దిగజారింది అంటూ వివరించింది.