‘పోలింగ్ తర్వాత రోజు మాచర్లలోని మా ఇంటి నుంచి నేను అడుగు బయటపెట్టలేదు. చుట్టూ పోలీసులు మోహరించారు. ఆ రోజంతా గృహ నిర్బంధంలోనే ఉన్నా. కారంపూడి ఎలా వెళ్తా? అక్కడికి వెళ్లి సీఐపై దాడి ఎలా చేస్తా? కారంపూడి ఘటనకు, నాకు సంబంధం లేదు’… ఇదీ రెండోరోజు విచారణలో పోలీసులకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటంతో పాటు విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేయడంపై స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని.. విచారణాధికారి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 వరకు సాగింది. కారంపూడి దాడిపై 65 ప్రశ్నలు అడగ్గా.. పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.