ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించి టీమిండియా విజేతగా నిలిచింది. అదే ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా విజయం ముందర బోల్తాపడిరది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనుకున్న దశలో మ్యాచ్ టర్న్ అయింది. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో ఇన్నింగ్స్ గాడి తప్పింది. అప్పటివరకు ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడిన క్లాసెన్ అవుట్ కావడం మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. హార్దిక్ పాండ్యా 17వ ఓవర్ వేసేందుకు వచ్చే సమయానికి మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపే ఉంది. ఆ సమయంలో హార్దిక్ ఆఫ్‌సైడ్ వేసిన బంతిని ఆడిన క్లాసెన్ కీపర్ పంత్‌కు దొరికిపోయాడు. క్లాసెన్ అవుట్ కావడమే దక్షిణాఫ్రికాకు విజయాన్ని దూరం చేసింది. మరోవైపు మిల్లర్ ఉన్నా బుమ్రా, అర్ష్‌దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి సఫారీలు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో మ్యాచ్ టీమిండియా సొంతమైంది.