ముకేశ్ అంబానీ ఇంట వివాహమంటే.. పెళ్లిపత్రికల నుంచీ అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చెంట్ల నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు ప్రతి కార్యక్రమం కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయి. మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో అతిథులకు దాదాపు 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు. జులై 12న ఇచ్చే పెళ్లివిందుకు ఇంకెన్ని రకాలు వండుతారో! అందులో కొన్నింటి వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ ఛాట్భండార్ వ్యాపారులు ఈ పెళ్లివిందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెనూలో కుల్ఫీ, ఫాలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ ఛాట్ లాంటి స్పెషల్స్ను అతిథుల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ విషయాన్ని కాశీ ఛాట్భండార్ యజమాని కేసరి ఓ జాతీయ మీడియాకు తెలిపారు.