బుధవారం అంతా ప్రమాణస్వీకారోత్సవంలో క్షణం తీరిక లేకుండా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు సాయంత్రం తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ పార్టీ నేతలను కలిశారు. మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం విజయవాడ అమ్మవారి సన్నిధిలో ఉన్నారు. ఆ వయసులో క్షణం తీరిక లేకుండా చంద్రబాబు శ్రమిస్తున్నారంటే..నిజంగా అభినందించాల్సిందే.. సీఎం హోదాలో విజయవాడ దుర్గమ్మ ఆలయానికి తొలిసారి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆశీర్వచనం అనంతరం లడ్డు ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులకు ఆలయ ఈవో రామారావు అందజేశారు. దర్శనం అనంతరం చంద్రబాబు ఇంద్రకీలాద్రి నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరారు.