ఆదివారంతో రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తవుతోంది. చట్ట ప్రకారం హైదరాబాద్‌తో, తెలంగాణతో బంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. ఐదేళ్లు ఈ విషయాలను విస్మరించిన జగన్ సర్కారు చివరాఖరులో తూతూమంత్రం సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇటీవల విభజన అంశాలపై సమావేశం నిర్వహించారు. అందులో ఏం తేల్చారంటే.. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆయా శాఖల పరిధిలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వీటిలో 5 మంత్రుల క్వార్టర్లు, 14 ఎమ్మెల్యే క్వార్టర్లు ఉన్నాయి. లేక్‌వ్యూ అతిథి గృహం, సీఐడీ హెడ్‌క్వార్టర్స్, హెర్మిటేజ్ భవనాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిని జూన్ 2 తర్వాత కూడా తమ అధీనంలోనే ఉంచుకుంటామని ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు.