దేశంలో ఊబకాయ సమస్య ఓ ముప్పుగా మారింది. దీన్నుంచి బయటపడేందుకు భారత వైద్య పరిశోధనా మండలి ఇటీవల కొన్ని కీలక సిఫార్సులు చేసింది. బరువు తగ్గేందుకు దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించాలని తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం కెలోరీలపై దృష్టిపెట్టడం కాకుండా.. సమతుల్య ఆహారం కోసం పండ్లు, కూరగాయలు, పప్పులు తీసుకోవడం ఎంతో ముఖ్యం. వారానికి 0.5 కిలోల బరువు తగ్గడం ఎంతో సురక్షితం. తద్వారా కండరాలకు నష్టం కలగకుండా, శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సర్దుబాటు అవుతుంది.అధిక బరువు ఉన్నప్పటికీ శరీర కనీస అవసరాల కోసం 1000 కిలోకేలరీలు ఉన్న ఆహారం తీసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన వంట విధానం కూడా ఒకటి. గ్రిల్లింగ్, స్టీమింగ్, బేకింగ్తోపాటు తక్కువ నూనెతో వేపుడు వంటివి కీలక పాత్ర పోషిస్తాయి.