ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సెబీ అనిల్ అంబానీకి రూ.25 కోట్ల జరిమానా విధించింది. దీంతోపాటు స్టాక్ మార్కెట్ నుంచి 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. వ్యాపారవేత్త అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా 24 మందిని స్టాక్ మార్కెట్, ఇతర సెక్యూరిటీలలో పాల్గొనకుండా సెబీ చర్యలు చేపట్టింది. ఇది కాకుండా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెబీ ఆరు నెలల పాటు మార్కెట్ నుంచి నిషేధించింది. దానిపై రూ.6 లక్షల జరిమానా విధించింది. అనిల్ అంబానీ, ఆర్హెచ్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులు ఆర్హెచ్ఎఫ్ఎల్ లింక్డ్ ఎంటీటీలకు రుణాల ముసుగులో నిధులను బదిలీ చేయడానికి ఒక మోసపూరిత పథకాన్ని రూపొందించారని సెబీ తన 222 పేజీల తుది ఆర్డర్లో వెల్లడిరచింది. సెబీ దర్యాప్తులో రుణాలు భారీగా పెరిగాయని, విధానపరమైన లోపాలు ఉన్నాయని తేలింది.