ఈమధ్య కాలంలో ఒక తెలుగమ్మాయికి మంచి పేరు వచ్చిందంటే ఆ అమ్మాయి ఒక్క వైష్ణవి చైతన్య అనే చెప్పాలి. ‘అల వైకుంఠపురంలో’ అల్లు అర్జున్‌కి చెల్లెలుగా నటించి ‘వాళ్ళు నా చున్నీ ఎత్తుకెళ్లిపోయారురా’ అంటూ అల్లు అర్జున్ తో అన్న ఆ సన్నివేశం అందరికీ గుర్తుంది. అదే వైష్ణవి చైతన్య గురించి అదే అల్లు అర్జున్ ‘బేబీ’ సినిమా విజయోత్సవ సభలో ఎంత గొప్పగా చెప్పారో కూడా అందరికీ తెలిసిన విషయమే. తెలుగు చిత్ర పరిశ్రమలో ముంబై, ఢల్లీి, తమిళం, మలయాళం ఇలా ఎక్కడినుండో వచ్చి తెలుగురాని కథానాయికలు ఏలుతున్న ఈ సమయంలో అవకాశం ఇస్తే తెలుగు అమ్మాయి ఎంత చక్కటి ప్రతిభను కనబరుస్తుందో చేసి చూపించింది వైష్ణవి.