ఓలా మరో వినూత్న ఆవిష్కరణతో ముందుకొస్తోంది. ఓలా సోలో పేరిట ప్రపంచంలోనే తొలి అటానమస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీజ్ చేసింది. ఏఐ సాయంతో ఈ స్కూటర్ పని చేస్తుందని ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఏప్రిల్ 1న విడుదల చేశారు. సాధారణంగా ఏప్రిల్ 1న చాలా కంపెనీలు ఫూల్ చేయడం కోసం కొన్ని వీడియోలను విడుదల చేస్తుంటాయి. ఓలా కూడా అదేతరహాలో ఏప్రిల్ ఫూల్ వీడియోను విడుదల చేసిందని చాలామంది భావించారు. దీనిపై ఏప్రిల్ 2న భవీశ్ మరో ట్వీట్లో వివరణ ఇచ్చారు. అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోను చాలామంది ఏప్రిల్ ఫూల్స్ జోక్ అని భావించారన్నారు. ఈ టెక్నాలజీపై తమ బృందం పని చేస్తోందని భవీశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రోటోటైప్ సిద్ధం చేసినట్లు పేర్కొంటూ తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు.