ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్టు అధిరోహణ అనుమతి రుసుమును నేపాల్ ప్రభుత్వం భారీగా పెంచింది. తాజా నిర్ణయంతో ఒక్కో పర్వతారోహకుడు చెల్లించాల్సిన మొత్తం 11వేల డాలర్ల నుంచి 15 వేల డాలర్లకు చేరింది. సవరించిన పర్వతారోహణ నిబంధనల ప్రకారం…వసంత రుతువు(మార్చి-మే)లో దక్షిణ మార్గం నుంచి ఎవరెస్టును అధిరోహించే విదేశీయులు 15 వేల డాలర్లు (రూ.12,96,580) చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత రుసుం 11వేల డాలర్ల కంటే ఇది 36శాతం అధికం. శరదృతువు (సెప్టెంబరు-నవంబరు)లో పర్వతారోహణ చేసే ఒక్కో వ్యక్తి 7,500 డాలర్లు (రూ.6,48,605), శీతాకాలం (డిసెంబరు-ఫిబ్రవరి), వర్షాకాలానికి (జూన్-ఆగస్టు) రుసుమును 3,700 డాలర్లు (రూ.3,24,301)గా ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబరు 1 నుంచి అమలు కానున్నట్లు నేపాల్ పర్యటక బోర్డు డైరెక్టర్ ఆరతి న్యూపానే తెలిపారు.