శ్రావణమాసం చివరి శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సొంతఖర్చుతో ప్రత్యేక కానుకగా 12వేల చీరలు అందజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్‌కల్యాణ్ పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారుచేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను సర్దారు. ఈ కార్యక్రమం రెండు రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్‌కల్యాణ్ నివాసంలో జరుగుతోంది. వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం ఉదయం పాదగయ క్షేత్రంలో అధికసంఖ్యలో పోటెత్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు 2వేల మందికే టోకెన్లు ఇవ్వగలిగారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా ఆరువేల మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఈఓ దుర్గాభవాని తెలిపారు.