అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. శృంగార తార స్టార్మీ డేనియల్తో అక్రమ సంబంధం కేసులో ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. దాదాపు 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధరించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. స్టార్మీ డేనియల్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ట్రంప్ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో పేర్కొన్నారు. దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. జులై 11న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.