సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఉంటేనే సమయస్ఫూర్తితో ఆలోచించగలం. ఇదే విషయాన్ని నిజం చేసి చూపించింది 13 ఏళ్ల బాలిక. అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సాయంతో కోతుల బారి నుంచి తనను, తన మేనకోడల్ని రక్షించుకుంది. నికిత బాలిక ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో నివాసముంటోంది. తన మేనకోడలు వామిక (15నెలలు) తో కలసి ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఓ కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించి గందరగోళాన్ని సృష్టించాయి. వాటిలో ఓ కోతి నికిత, తన మేనకోడలు వద్దకు వచ్చింది. సమయస్ఫూర్తితో ఆలోచించింది. వెంటనే ఇంట్లో ఉన్న వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా గుర్తుకువచ్చింది. అంతే ‘‘అలెక్సా.. శునకంలా మొరుగు’’ అని ఆదేశించింది. వెంటనే అలెక్సా పెద్దగా మొరిగే కుక్క శబ్దాలు చేయడం ప్రారంభించింది. దాంతో భయపడిన కోతులు అక్కడినుంచి పారిపోయాయి.