పోలీసులు సవాలుగా తీసుకుంటే ఏ కేసునైనా ఛేదించగలరు అనడానికి ఉదాహరణే ఈ ఉదంతం. తొమ్మిది నెలల కిందట విజయవాడలో అదృశ్యమైన యువతి జాడను కనిపెట్టడంలో ఇన్నాళ్లూ నిర్లిప్తంగా ఉన్న పోలీసులు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో పది రోజుల్లోనే జమ్మూలో గుర్తించారు. యువతితో పాటు ఆమె స్నేహితుడిని విమానంలో విజయవాడకు తరలించారు. జూన్ 22న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పవన్.. మాచవరం సీఐ గుణరాముకు ఫోన్ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి, యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. తేజస్విని విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతోంది. అదే కళాశాల సీనియర్ విద్యార్థి, నిడమానూరుకు చెందిన అంజాద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని లోబరుచుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో జమ్ములో ఉన్నట్టు గుర్తించారు.