ఇంట్లో కుమారుని వివాహం, మహాత్మాగాంధీ క్రిప్స్ రాయబారితో చర్చల నిమిత్తం ఢల్లీి రమ్మని ఆహ్వానం. సాధారణంగా ఎవరైనా, ఎంతటి దేశ స్వాతంత్య్ర అభిమాని అయినా సున్నితంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి కుమారుని వివాహవేడుకల్లో మునకలవుతారు. కానీ ఆయన అలా చేయలేదు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఢల్లీి రైలెక్కేశారు భోగరాజు పట్టాభి సీతారామయ్య.
పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను గ్రామంలో 1880 నవంబరు 24న జన్మించారు. ప్రాథమిక విద్య గుండుగొలనులో పూర్తి చేశారు. ఆపై చదువులకు మచిలీపట్నం వెళ్ళి యం.బి.బి.యస్. పట్టా అందుకున్నారు. 1906లో మచిలీపట్నంలోనే డాక్టరుగా ప్రాక్టీసు ప్రారంభించారు. అట్టడుగు వర్గ ప్రజలకు వైద్య సదుపాయాలందించటంలో సిద్ధహస్తుడనిపించుకున్నారు. పలు రంగాలలో పనిచేసి ప్రజాభిమానం చూరగొన్నారు. ‘‘భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన అంశంపై చర్చ’’ జరుగుతోంది. గాంధీజీ, నెహ్రూ, ఆజాద్ లాంటి నేతలు ఆ సదస్సుకు హాజరయ్యారు. అప్పటికి మనం మద్రాసు రాష్ట్రంలో కొనసాగుతుండగా ఆ సదస్సులోని ఒకరు ‘‘ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు?’’ అని ప్రశ్నించారు. పట్టాభి సీతారామయ్య నిలబడి తన కోటు జేబులోని అణా నాణెం తీసి, బల్లమీదకు విసిరారట. అప్పటికే ముద్రితమవుతున్న నాణెములపై తెలుగు లిపిలో వివరాలుండేవి. ‘‘అణాపై తెలుగు అక్షరాలెందుకు?’’ అని ప్రశ్నించారు. అలా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదన వినిపించారు. 1953 నాటికి అది నెరవేరింది.
‘వందేమాతరం’ ఉద్యమంపై అభిలాషతో వైద్య వృత్తికి తిలోదకాలిచ్చారు. క్రమక్రమంగా గాంధీజీకి దగ్గరయ్యారు. రాజకీయ క్రియాశీలకుడిగా గుర్తింపు పొందారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడి, ఏడేళ్లు జైల్లో గడిపారు. ‘‘ఫెదర్ ఫ్రెండ్స్ అండ్ స్టోన్స్’’ అనే పుస్తకం జైలులోనే రాశారు. 1908లోనే మచిలీపట్నంలో మొట్టమొదటిసారి తెలుగు జిల్లాల నాయకులతో చర్చ నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికారు. 1920 నుంచి గాంధీజీతో సాన్నిహిత్యం పెరిగింది. వారి ఆశీస్సులతో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడయ్యారు. రాజకీయాలతో సతమతమవుతూనే పత్రికారంగం వైపు దృష్టి సారించారు. మూడు భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల భాషాచతురుడు ‘‘జన్మభూమి’’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ‘‘ఇండియన్ రిపబ్లికన్’’ అనే మాసపత్రికను, తెలుగు సహకార పత్రికలను ప్రారంభించి, ఆయా రంగాలకు సంబంధించిన అపురూప సమాచారం అందించేవారు. 1948 నుండి 1950 వరకు అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1952-57 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన ‘‘ఐ టు హావ్ స్పిన్’’ ‘‘గాంధీ,గాంధీయిజమ్’’ లాంటి అపురూప గ్రంథాలు అందించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతాంగానికి అపురూప సేవలందిస్తున్న సహకార బ్యాంకును స్థాపించారు. రెండేళ్ళ క్రితం వరకు ఆంధ్రలోనే కాదు, ఏ రాష్ట్రంలోనయినా ‘ఇది మా బ్యాంకు’ అని గర్వంగా చెప్పుకొనే ‘‘ఆంధ్రబ్యాంకు’’ను స్థాపించింది కూడా ఆయనే! మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర ఇన్స్యూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకులు కూడా. ‘పదవుల కన్నా ప్రజాసేవ మిన్న’ అంటూ ముందుకు సాగిన భోగరాజు పట్టాభి సీతారామయ్య 1959 డిసెంబరు 17న హైదరాబాదులో కన్నుమూశారు.
- దాసరి ఆళ్వారస్వామి